మాకవరపాలెం జూనియర్ కళాశాలలో ఘనంగా 'మెగా పేరెంట్స్ 4.0' కార్యక్రమం 'కళాభారతి' వేదికను ప్రారంభించిన స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దాతల సహకారంతో కళాశాలకు కొత్త రూపు.. రూ.8 లక్షలతో అభివృద్ధి పనులు 'తల్లికి వందనం'తో విద్యార్థులకు భారీ ఆర్థిక చేయూత: స్పీకర్ రూ.500 కోట్ల జల్ జీవన్ మిషన్‌తో ప్రతి ఇంటికీ మంచినీరు అందిస్తాం

మాకవరపాలెం, జూలై 24:( స్పీడ్ న్యూస్) అనకాపల్లి జిల్లా మాకవరపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన 'మెగా పేరెంట్స్ 4.0' కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ముఖ్య అతిథిగా హాజరై, కళాశాలలో నూతనంగా నిర్మించిన 'కళాభారతి' వేదికను ప్రారంభించారు. కళాశాల అభివృద్ధికి విరాళాలు అందించిన దాతలను శాలువాలతో సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, గతంలో ఈ జూనియర్ కళాశాల అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉండేదని, ఆ స్థితిని చూసి దాతల సహకారంతో సుమారు రూ.8 లక్షల విరాళాలు సేకరించి కళాశాల రూపురేఖలను పూర్తిగా మార్చామని తెలిపారు. ఈ నిధులతో కళాభారతి స్టేజీ నిర్మాణం, కాంపౌండ్ వాల్, ప్రధాన ద్వారం, నేమ్ బోర్డు ఏర్పాటు, పెయింటింగ్ పనులు, వాటర్ ప్లాంట్ మరమ్మతులు, పాత భవనం తొలగింపు వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. అదనంగా రూ.2.90 లక్షలతో ఆధునిక వాలీబాల్ కోర్టు కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమాన బాధ్యతతో పనిచేయాలని, గ్రామ పెద్దలు కూడా స్థానిక విద్యాసంస్థల అభివృద్ధిపై నిరంతరం దృష్టి పెట్టాలని స్పీకర్ పిలుపునిచ్చారు. విద్య అనేది ప్రతి కుటుంబ అభివృద్ధికి బలమైన పునాది అని, పిల్లలను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించాలని సూచించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం ద్వారా ప్రతి విద్యార్థికి రూ.15 వేల ఆర్థిక సహాయం అందజేస్తోందని తెలిపారు. ఇందులో రూ.13 వేలును విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేయడంతో పాటు రూ.2 వేలును పాఠశాల లేదా కళాశాల నిర్వహణ నిధికి కేటాయిస్తున్నట్లు వివరించారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 67 లక్షల 47 వేల మంది విద్యార్థులకు రూ.10,120 కోట్ల నిధులు, అనకాపల్లి జిల్లాలో 2,13,573 మంది విద్యార్థులకు రూ.277.64 కోట్లు, నర్సీపట్నం నియోజకవర్గంలో 31,856 మంది విద్యార్థులకు రూ.41.41 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. ఇప్పటికే నియోజకవర్గంలో 17 వేల మందికి పైగా లబ్ధిదారులకు అంగీకార పత్రాలు అందజేసి నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు.
మాకవరపాలెం ప్రాంతంలో త్వరలోనే భారీ పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయని, స్థానిక విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకుని బాగా చదువుకుంటే ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే మంచి అవకాశాలు లభిస్తాయని స్పీకర్ పేర్కొన్నారు.
అదేవిధంగా నర్సీపట్నం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించేందుకు జల్ జీవన్ మిషన్ పథకం కింద రూ.500 కోట్ల భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వేలాది కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి వస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, అధికారులు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, దాతలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.