ఢిల్లీలో సీఎం చంద్రబాబుకు రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ ఘన స్వాగతం ఆగస్టు 1న జరిగే విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై కీలక చర్చలు

ఢిల్లీ, జూలై 22: ( స్పీడ్ న్యూస్)
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అధికారికంగా ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ విమానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ తోటి ఎంపీలతో కలిసి ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.
విమానాశ్రయంలో సీఎం చంద్రబాబుకు ఎంపీ చింతకాయల విజయ్ పుష్పగుచ్ఛం అందించి ఆత్మీయంగా స్వాగతించారు. అనంతరం రాష్ట్రానికి అత్యంత కీలకమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, సభా నిర్వహణ తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది.
రాష్ట్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా భావిస్తున్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 1న జరిగే ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ చర్యలు వేగవంతమయ్యాయి.
ఈ సందర్భంగా పలువురు పార్లమెంట్ సభ్యులు కూడా ముఖ్యమంత్రిని కలిసి స్వాగతం పలికారు. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, కేంద్ర సహకారంతో చేపడుతున్న కీలక ప్రాజెక్టులపై కూడా చర్చలు జరిగినట్లు సమాచారం.
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపునివ్వడంతో పాటు పర్యాటకం, పారిశ్రామిక రంగం, ఉపాధి అవకాశాల విస్తరణకు దోహదపడుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను ముమ్మరం చేసింది.