మహిళల రక్షణే లక్ష్యం.. గొలుగొండ పోలీసుల 'అభయ' కార్యక్రమానికి విశేష స్పందన 112, 181, 1930 హెల్ప్‌లైన్‌లపై మహిళలకు అవగాహన కల్పించిన పోలీసులు సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక

గొలుగొండ, జూలై 21:
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఏటి గైరమ్మపేట గ్రామంలో మహిళల భద్రత, సాధికారత లక్ష్యంగా గొలుగొండ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మంగళవారం "అభయ" అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గొలుగొండ పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు సుమారు 300 మంది మహిళలు పాల్గొన్నారు.
కార్యక్రమంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాల నివారణకు పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలను అధికారులు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో 112 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్, మహిళల రక్షణ కోసం 181 మహిళా హెల్ప్‌లైన్, సైబర్ నేరాల ఫిర్యాదుల కోసం 1930 సైబర్ హెల్ప్‌లైన్, చిన్నారుల సహాయానికి 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ సేవలను ఎలా వినియోగించుకోవాలో వివరంగా అవగాహన కల్పించారు.
బాల్య వివాహాల వల్ల కలిగే చట్టపరమైన, ఆరోగ్యపరమైన మరియు సామాజిక దుష్పరిణామాలను వివరించిన పోలీసులు, అలాంటి సంఘటనలు గమనించిన వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. అలాగే గృహ హింస, మహిళలపై వేధింపులు, 498ఏ చట్టంతో పాటు మహిళల రక్షణకు సంబంధించిన ఇతర చట్టాలపై అవగాహన కల్పించారు.
మహిళలపై జరిగే నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఫోన్ కాల్స్, సోషల్ మీడియా, ఆన్‌లైన్ లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాల పేరుతో జరిగే సైబర్ మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనుమానాస్పద సంఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
మహిళల భద్రత కోసం ప్రభుత్వం, పోలీస్ శాఖ అందిస్తున్న రక్షణ చర్యలు, సంక్షేమ సేవలను ప్రజలకు వివరించిన అధికారులు, ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా ఆలస్యం చేయకుండా పోలీసుల సహాయాన్ని పొందాలని సూచించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువతులు, పోలీసు సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.