జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో మరో అరుదైన గౌరవం 🇮🇳 భారతదేశం తరఫున ఎంపికైన కొద్దిమంది క్రీడాకారుల్లో చోటు దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి ప్రతిష్ఠాత్మక ISU అంతర్జాతీయ శిక్షణా శిబిరానికి నర్సీపట్నం స్కేటర్ చైత్ర దీపిక ఎంపిక

నర్సీపట్నం, జూలై 21:(స్పీడ్ న్యూస్)
అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన అంతర్జాతీయ ఐస్ మరియు రోలర్ స్కేటర్ పెదిరెడ్ల చైత్ర దీపిక మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రపంచ ఐస్ స్కేటింగ్ అత్యున్నత సంస్థ అయిన ఇంటర్నేషనల్ స్కేటింగ్ యూనియన్ (ISU) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక సింక్రో-9 డెవలప్‌మెంట్ ట్రైనింగ్ క్యాంప్‌కు ఆమె అధికారికంగా ఎంపికయ్యారు. ఈ ఎంపికతో నర్సీపట్నం ప్రాంతానికి, అనకాపల్లి జిల్లాకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశేష గౌరవం దక్కింది.
జాతీయ స్థాయిలో చైత్ర దీపిక కనబరిచిన అసాధారణ ప్రతిభ, క్రమశిక్షణ, అంకితభావం మరియు అత్యుత్తమ ప్రదర్శనలను గుర్తించిన ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆమెను ఈ అంతర్జాతీయ శిక్షణా శిబిరానికి నామినేట్ చేసింది. భారతదేశం నుంచి ఎంపికైన కొద్దిమంది క్రీడాకారుల్లో ఒకరిగా ఆమె నిలవడం విశేషం.
ఈ ప్రతిష్ఠాత్మక శిక్షణలో పాల్గొనేందుకు చైత్ర దీపిక ఇప్పటికే థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ చేరుకున్నారు. అక్కడి IWIS ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెంటర్‌లో జూలై 19 నుండి 25 వరకు జరుగుతున్న శిబిరంలో ప్రపంచస్థాయి కోచ్‌ల పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ పొందనున్నారు.
ఈ శిక్షణా శిబిరంలో పాల్గొనే క్రీడాకారులకు సింక్రొనైజ్డ్ స్కేటింగ్, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు, కొరియోగ్రఫీ, ఫిట్‌నెస్, బ్యాలే, మ్యూజిక్ మూవ్‌మెంట్ తదితర అంశాలలో అత్యున్నత స్థాయి శిక్షణ అందించనున్నారు. భవిష్యత్తులో జరిగే అంతర్జాతీయ సింక్రొనైజ్డ్ స్కేటింగ్ పోటీల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులను తీర్చిదిద్దడమే ఈ క్యాంప్ ప్రధాన లక్ష్యంగా నిర్వాహకులు పేర్కొన్నారు.
చైత్ర దీపిక ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో విశేష విజయాలు సాధించారు. 2026 డెహ్రాడూన్ జాతీయ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం, 2026 తైవాన్ ఓపెన్ అంతర్జాతీయ రోలర్ స్కేటింగ్ పోటీల్లో రెండు రజతాలు, ఒక కాంస్య పతకం, 2025 ఆస్ట్రేలియా వరల్డ్ స్కేట్ ఓషియానియా పసిఫిక్ కప్‌లో మూడు స్వర్ణ పతకాలు, 2025 తైవాన్ ఓపెన్‌లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు, అలాగే 2023 బీజింగ్ ఆసియా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి దేశ ఖ్యాతిని అంతర్జాతీయ వేదికలపై చాటారు.
చైత్ర దీపిక సాధించిన ఈ ఘనతపై ఆమె కుటుంబ సభ్యులు, కోచ్‌లు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ శిక్షణా శిబిరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, భవిష్యత్తులో ఒలింపిక్స్‌తో పాటు ప్రపంచస్థాయి పోటీల్లో భారతదేశానికి మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఆమెకు నిరంతరం సహకరిస్తున్న ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అమితాబ్ శర్మ, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పార్కుకి శర్మ, జనరల్ సెక్రటరీ జాగ్రజ్ సహాని, అలాగే టీమ్ ఇండియా రోలర్ స్కేటింగ్ కోచ్‌లు అనూప్ కుమార్ యమా, పి. సత్యనారాయణ, ఫిట్‌నెస్ కోచ్ రామ్మోహన్ తదితరులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
నర్సీపట్నం గడ్డపై పుట్టి అంతర్జాతీయ స్థాయిలో భారత జెండాను రెపరెపలాడిస్తున్న చైత్ర దీపిక విజయగాథ యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని పలువురు క్రీడా ప్రముఖులు అభిప్రాయపడ్డారు.