అనకాపల్లి, జూలై 20:(స్పీడ్ న్యూస్)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో అనకాపల్లిలో నిర్వహించిన ప్రతిష్టాత్మక 'షైనింగ్ స్టార్స్-2026' అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ముఖ్య అతిథిగా హాజరై, 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు అందజేశారు.
అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 10వ తరగతిలో 154 మంది, ఇంటర్మీడియట్‌లో 34 మంది విద్యార్థులు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. ప్రతి విద్యార్థికి రూ.20,000 నగదు బహుమతి, ఒక మెడల్, ప్రశంసాపత్రం అందజేసి స్పీకర్ అభినందించారు. విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన విద్యార్థులు అత్యధికంగా అవార్డులు సాధించడం పట్ల స్పీకర్ ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గం నుంచి మొత్తం 31 మంది విద్యార్థులు ఎంపిక కాగా, వారిలో 10వ తరగతి నుంచి 26 మంది, ఇంటర్మీడియట్ నుంచి 5 మంది ఉన్నారు. ముఖ్యంగా వీరిలో 22 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే కావడం ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడుతున్నాయనడానికి నిదర్శనమని కొనియాడారు.
సభను ఉద్దేశించి మాట్లాడిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత పెంపు, మౌలిక వసతుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10వ తరగతిలో 570కి పైగా మార్కులు సాధించిన 54 మంది విద్యార్థులు ఉండటం గర్వకారణమన్నారు.
అదేవిధంగా, ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్షలో 40 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం, నర్సీపట్నం అంబేద్కర్ రెసిడెన్షియల్ స్కూల్‌కు చెందిన ఓ విద్యార్థిని ప్రతిష్టాత్మక ఐఐటీలో సీటు సాధించడం ప్రభుత్వ విద్యా వ్యవస్థకు దక్కిన గొప్ప గుర్తింపుగా ఆయన పేర్కొన్నారు.
విద్యార్థులు లక్ష్యసాధన దిశగా కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని స్పీకర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.