నర్సీపట్నం:(స్పీడ్ న్యూస్)
రొటరీ క్లబ్ ఆఫ్ నర్సీపట్నం 2026–27 సంవత్సరానికి నూతన కార్యవర్గ బాధ్యతల స్వీకారోత్సవం శనివారం సాయంత్రం పట్టణంలోని శ్రీ వేదిక ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. క్లబ్ నూతన అధ్యక్షుడిగా మాకిరెడ్డి సత్యనారాయణ (అంకిత), కార్యదర్శిగా తాటికొండ హేమంత్, కోశాధికారిగా పెనుగొండ రమేష్ బాధ్యతలు స్వీకరించారు. అలాగే నూతన కార్యవర్గ సభ్యులు కూడా ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సీపట్నం వార్డు కౌన్సిలర్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు చింతకాయల రాజేష్ హాజరయ్యారు. అసిస్టెంట్ గవర్నర్ సానా త్రినాథరావు ఇన్‌స్టాలేషన్ అధికారిగా వ్యవహరించి నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రముఖ వ్యాపారవేత్త జలుమూరి బంగార్రాజు గౌరవ అతిథిగా పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.
నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షుడు, జాయింట్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ, రొటరీ ఫౌండేషన్, మెంబర్‌షిప్ డెవలప్‌మెంట్, పబ్లిక్ ఇమేజ్, కమ్యూనిటీ సర్వీస్, హెల్త్ క్యాంప్, బ్లడ్ క్యాంప్, వ్యవసాయ అభివృద్ధి తదితర విభాగాలకు సభ్యులను నియమించారు. సమాజ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తూ ప్రజలకు చేరువ కావాలని నూతన కార్యవర్గం సంకల్పం వ్యక్తం చేసింది.
కార్యక్రమంలో భాగంగా సేవా కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. పట్టణంలోని సానిటరీ సిబ్బందికి నిత్యావసర సరుకులను చింతకాయల రాజేష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అలాగే మెకానిక్ సోదరులకు కుర్చీలను అందజేసి వారి సేవలను అభినందించారు.
ఈ సందర్భంగా మరో విశేషం చోటుచేసుకుంది. నర్సీపట్నం టీడీపీ పట్టణ అధ్యక్షుడు చింతకాయల రాజేష్ రొటరీ క్లబ్ సభ్యుడిగా (రొటేరియన్‌గా) అధికారికంగా సభ్యత్వం స్వీకరించారు. ఆయనతో పాటు మరికొందరు ప్రముఖులు కూడా రొటరీ క్లబ్‌లో సభ్యులుగా చేరారు.
రొటరీ క్లబ్ ద్వారా విద్య, వైద్యం, రక్తదాన శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయాభివృద్ధి, యువత సాధికారత వంటి రంగాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు నూతన అధ్యక్షుడు మాకిరెడ్డి సత్యనారాయణ (అంకిత) తెలిపారు.
ఈ కార్యక్రమానికి రొటరీ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతల స్వీకారం అనంతరం సభ్యులకు విందు ఏర్పాటు చేశారు.