విధి నిర్వహణలో నిర్లక్ష్యం ముగ్గురు బీఎల్వోలపై సస్పెన్షన్ వేటు ఉత్తర్వులు జారీ చేసిన అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్*
అనకాపల్లి, నర్సీపట్నం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ కఠిన చర్యలు తీసుకున్నారు. విధి నిర్వహణలో అలసత్వాన్ని ప్రదర్శించిన ముగ్గురు బూత్ లెవల్ అధికారులను బీఎల్వోలు సస్పెండ్ చేస్తూ శనివారం ఆమె అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.సస్పెన్షన్కు గురైన అధికారులు వీరే మాకవరపాలెం మండలానికి చెందిన ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు బీఎల్వోలుగా విధులు నిర్వహిస్తూ, తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమయ్యారు. సస్పెండ్ అయిన వారి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి శ్రీమతి బి. వైడూర్యం పంచాయతీ కార్యదర్శి & బీఎల్వో, పోలింగ్ స్టేషన్ నెం. 224 పైడిపాల, మాకవరపాలెం మండలం.
శ్రీ పి. అప్పలాచారి: పంచాయతీ కార్యదర్శి & బూత్ లెవల్ ఆఫీసర్, పోలింగ్ స్టేషన్ నెం. 257 కోడూరు, మాకవరపాలెం మండలం.
శ్రీ వి. రాంబాబు: పంచాయతీ కార్యదర్శి & బూత్ లెవల్ ఆఫీసర్, పోలింగ్ స్టేషన్ నెం. 244 రాచపల్లి, మాకవరపాలెం మండలం.నిబంధనల ఉల్లంఘనే కారణం
ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ క్లాసిఫికేషన్, కంట్రోల్ అండ్ అప్పీల్ రూల్స్, 1991 లోని రూల్ 8 యొక్క సబ్-రూల్ 1 ద్వారా కల్పించబడిన అధికారాలను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ ఈ సస్పెన్షన్ వేటు వేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనేది అత్యంత కీలకమైన మరియు బాధ్యతాయుతమైన ప్రక్రియ అయినప్పటికీ, సదరు అధికారులు విధులను సక్రమంగా నిర్వర్తించకపోవడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు ఉన్నతాధికారుల తనిఖీల్లో తేలింది. ఈ నేపథ్యంలోనే వారిపై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
బాధ్యతారాహిత్యాన్ని ఉపేక్షించబోం: కలెక్టర్ హెచ్చరిక ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ స్పందిస్తూ.. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, గడువులోగా పూర్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇలాంటి కీలకమైన విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, నిబంధనలను ఉల్లంఘించినా, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆమె తీవ్రంగా హెచ్చరించారు. అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండి తమకు కేటాయించిన విధులను సకాలంలో పూర్తి చేయాలని, లేనిపక్షంలో శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు.
04 Jul 2026