నర్సీపట్నంలో పోలీసుల థర్డ్ డిగ్రీ ఆరోపణలు వైసీపీ కార్యకర్తపై ఎస్ఐ రాజారావు అమానుషంగా వ్యవహరించారంటూ ఆరోపణలు బాధితుడిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్
నర్సీపట్నం (స్పీడ్ న్యూస్)
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఓ వైసీపీ కార్యకర్తపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. గ్రామంలో జరిగిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో అక్రమాలను ప్రశ్నించినందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని బాధితుడు ఆరోపించారు.
బాధితుడి కథనం ప్రకారం, రూరల్ ఎస్ఐ రాజారావు తనను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టారని, తీవ్ర శారీరక హింసకు గురిచేశారని తెలిపారు. అంతేకాకుండా, అధికార పార్టీ నేతలకు వీడియో కాల్స్ చేసి తనపై జరుగుతున్న దాడిని చూపించారని, ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారని ఆరోపించారు. ప్రస్తుతం బాధితుడు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఘటన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆసుపత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బాధితుడికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్, ప్రశ్నించినందుకే ఒక కార్యకర్తపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆరోపించారు. రూరల్ ఎస్ఐ రాజారావును తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేసి, ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధితుడికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
అయితే, ఈ ఘటనకు సంబంధించి బాధితుడు మరియు వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలపై పోలీసులు లేదా సంబంధిత అధికారుల నుంచి అధికారిక స్పందన వెలువడలేదు. ఘటనపై విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది అని మాజీ ఏం ఎల్ ఏ గణేష్ అన్నారు
04 Jul 2026