నర్సీపట్నంలో ఘనంగా అల్లూరి 129వ జయంతిపర్యాటక కేంద్రంగా కృష్ణదేవిపేట అభివృద్ధి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు వేడుకలు*
మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలను నర్సీపట్నంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో అల్లూరి సెంటర్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. చిన్న వయసులోనే గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయాలపై స్పందించి బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన మహావీరుడు అల్లూరి అని కొనియాడారు. ఆయన త్యాగాలను, పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అల్లూరి భౌతికకాయాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించిన కృష్ణదేవిపేట లో అల్లూరి సమాధి ఉందని, గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించేలా జీవో ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం కృష్ణదేవిపేట లో అల్లూరి సీతారామరాజు పార్కును అభివృద్ధి చేశామని, క్షత్రియ సోదరుల సహకారంతో అక్కడ పెద్ద విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశామని అయ్యన్నపాత్రుడు తెలిపారు. కేడీపేటను గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఎంపీలు, ఇతర పెద్దలు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారని వెల్లడించారు. ప్రతి ఏటా లంబసింగికి లక్షా అరవై వేల మందికి పైగా పర్యాటకులు వస్తున్నారని, అక్కడికి సమీపంలో ఉన్న కేడీపేట అల్లూరి పార్కుకు కూడా ఆ పర్యాటకులు వచ్చేలా అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. పర్యాటకులు నర్సీపట్నం వచ్చి ఆగితే స్థానికంగా వ్యాపారం పెరిగి ఈ ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని, అల్లూరి స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
ఈ జయంతి వేడుకల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అనకాపల్లి శాసనసభ సభ్యులు కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య పోరాటంలో అల్లూరి సీతారామరాజు పాత్ర ఎంతో కీలకమైనదని, ఆయన ప్రాణత్యాగం ప్రతి భారతీయుడికి గర్వకారణమని పేర్కొన్నారు. గిరిజనులకు కనీస కూలీ ఇవ్వకుండా, పోడు వ్యవసాయం చేసుకోనివ్వకుండా బ్రిటిష్ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులను ఎదుర్కొని, అహింసా మార్గంలో వినని ఆంగ్లేయులను వారి తుపాకులతోనే కాల్చి చంపిన గొప్ప ధీరుడు అల్లూరి అని కొనియాడారు. నర్సీపట్నంలో అల్లూరి విగ్రహాన్ని, సెంటర్ను ఏర్పాటు చేసిన క్షత్రియ పరిషత్ సభ్యులను, ఇందుకు ప్రోత్సాహం అందించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడిని ఆయన అభినందించారు. అయ్యన్నపాత్రుడు ఎప్పుడూ కృష్ణదేవిపేట మరియు ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుంటారని ప్రశంసించారు. నేటి తరానికి, పిల్లలకు అల్లూరి చరిత్ర తెలిసేలా పాఠ్యాంశాల్లో ఆయన పోరాట ఘట్టాలను చేర్చాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకోవాలని కొణతాల రామకృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దాట్ల సూర్యనారాయణ రాజు, జనసేన ఇన్చార్జి సూర్యచంద్ర, ప్రముఖులు గణపతిరాజు సూర్య బంగార్రాజు, జంపన నాగేంద్ర రాజు, క్షత్రియ పరిషత్ సభ్యులు, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
04 Jul 2026